శ్రీ శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అప్పగించిన దాతలు..
వరంగల్, సెప్టెంబర్ 18: వరంగల్ నగరంలోని కాకతీయ సినిమా థియేటర్స్ కాంప్లెక్స్ వ్యవస్థాపకులు, ప్రముఖ ధార్మికవేత్తలు స్వర్గీయ సీతారామాంజనేయులు. పుష్ప బేబీ స్వర్ణ కుమారి దంపతుల కోరిక మేరకు వరంగల్ నగరం శ్రీనివాస కాలనీలోని కోట్ల రూపాయల విలువైన సకల వసతులతో కూడిన రెండంతస్తుల అధునాతన భవనం ను వారి కుటుంబ సభ్యులు వరంగల్ శ్రీ శృంగేరి శంకరమఠంకు దానంగా గురువారం అందజేశారు. సీతారామాంజనేయులు, బేబీ స్వర్ణ కుమారి కుటుంబ సభ్యులు శ్రీరామ్మూర్తి, విశ్వేశ్వర్ రావు తదితర కుటుంబ సభ్యులు గురువారం కర్ణాటక రాష్ట్రం శ్రీ శృంగేరి లోని శ్రీ శృంగేరి శంకరమఠం సన్నిధానంలో శ్రీ శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతికి గృహాన్ని శంకరమఠం కు దానం చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందజేశారు. విద్యారణ్య స్వామి జన్మించిన వరంగల్ మహానగరంలో శ్రీ శృంగేరి శంకర మఠం నూతన నిర్మాణం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిత్య పూజలకు, విశేషంగా జరిగే శారద శరన్నవరాత్రులకు ఈ భవనం ఎంతో ఉపయుక్తముగా ఉంటుందని స్వామి అనుగ్రహించి మంత్రాక్షింతలతో దాతల కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం ప్రధాన అర్చకులు, బ్రాంచ్ హెడ్ సంగమేశ్వర జోషి,దాతలు రామ్మూర్తి,విశ్వేశ్వర్ రావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
