Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఖమ్మం జిల్లా

ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఖమ్మం)
నష్టపోయిన ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావుఅన్నారు.మొంథా తుఫాన్ కారణంగా పేద ప్రజలు కోల్పోయిన ఇండ్లు, పశువులు, పంట,ఇతర నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రి,గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కాల్వఒడ్డు బ్రిడ్జ్,నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ లలో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వాతావరణ శాఖ మొంథా తుఫాన్ పై సమాచారం అందించిన వెంటనే జిల్లా కలెక్టర్, యంత్రాంగంను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించడం జరిగిందని అన్నారు.రిలీఫ్ క్యాంపులో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన భోజన సౌకర్యాలు కల్పించామని అన్నారు. రాత్రి నిద్ర పోకుండా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను ప్రతి అరగంటకు ఒకసారి మానిటర్ చేస్తూ జిల్లా యంత్రాంగం పని చేసిందని మంత్రి ప్రశంసించారు.మున్నేరు నది 26 అడుగుల ఎత్తులో ప్రవహించిందని, నెమ్మదిగా నీటి ప్రవాహం తగ్గుతుందని మంత్రి అన్నారు. మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడిన కలెక్టర్, పోలీసులకు, మున్సిపల్ కమీషనర్, ఇతర యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలియజేశారు.

మొంథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పక్కా రిపోర్టు అధికారులు తయారు చేస్తారని మంత్రి తెలిపారు.తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయిన నష్టపోయిన ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 11 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్ లో మున్నేరు నది రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఖమ్మం నగరానికి ఎటువంటి ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంలో ప్రజలు సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి దంసలాపురం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరద బాధితుల కోసం నెల వేతనం విరాళం. దాతృత్వం చాటుకున్న..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర