జై భారత్ వాయిస్ న్యూస్
పాయకరావుపేట,నవంబర్ 12:- మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని హోం మంత్రి అనితప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 30 రోజుల పాటు, సుమారు 800 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో విద్యార్థులతో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతగానో అలరించింది. ‘మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు’ అంటూ ఫ్లాష్‌మాబ్‌లో విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు హోం మంత్రి అనిత. అనంతరం మంత్రి స్వయంగా గౌతమ్ థియేటర్ నుండి సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొని శ్రీప్రకాశ్ కాలేజ్ వరకు నడిపారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూఎన్డియే ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించాలని సూచించారు. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. మన భవిష్యత్ – మన చేతుల్లోనే ఉందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. యువత భవిష్యత్ చాలా ముఖ్యమని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్‌పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు. గంజాయి రవాణా చేసిన, గంజాయి సేవిస్తున్నా వెంటనే 1972 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందగానే పోలీసులు వస్తారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
previous post

