జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:క్రీడలలో ప్రపంచమే మీ దిక్కు చూసే విధంగా క్రీడాకారులు ప్రతిభను చాటాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో 11వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ 2025-26 పోటీల ముగింపు, విజేతలకు బహుమతులను ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరు కాగా వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, తదితరులు హాజరయ్యారు.
హన్మకొండ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 23 తేదీల్లో మహిళలు, పురుషుల జూనియర్, సీనియర్ స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేల సమక్షంలో పలువురు వెయిట్ లిఫ్టర్లు వివిధ కేటగిరీలలో వెయిట్ లిఫ్ట్ చేశారు. ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులకు పతకాలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలోనే నాలుగవ స్పోర్ట్స్ స్కూల్ ను జిల్లాకు మంజూరు చేసి ఇటీవలే ప్రారంభించుకొన్నామని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రోత్సాహం ఉండాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించారని అభినందనలు తెలిపారు. క్రీడలను ఆషామాషీ గా తీసుకోవద్దని, క్రీడలలో లీనమై పోవాలని, మీ ప్రతిభను చూసి ప్రపంచమే మీ దిక్కుకు చూడాలన్నారు. ఇంత పెద్ద స్థాయిలో క్రీడలలో ప్రోత్సాహం ఉందని, తాము ఆడినప్పుడు ప్రోత్సాహమే లేదని, ప్రోత్సాహం ఉంటే ఐదు ఆరుసార్లు దేశస్థాయి క్రికెట్లో ఆడేవాడినని అన్నారు. బౌలింగ్ లో ప్రపంచస్థాయి క్రికెటర్లు వేసే ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చూసి స్ఫూర్తి పొందేవాడినని పేర్కొన్నారు. క్రీడల పట్ల ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలని అన్నారు. క్రీడల్లో వరంగల్ జిల్లాకు తద్వారా రాష్ట్రానికి పేరును తీసుకురావాలన్నారు. క్రీడల్లో ఏ క్రీడాకారుడు కూడా వెనకడుగు వేయొద్దన్నారు. క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటుంటే సెవెంత్ సెన్స్ ఎయిత్ సెన్స్ కూడా పనిచేయాలని, అప్పుడే విజయం సాధిస్తారని తెలిపారు. క్రీడాకారుల చెమట గ్రౌండ్ కు తాకాలని అన్నారు. క్రీడాకారులు గ్రౌండ్ను ఆటను నమ్ముకోవాలని హితవు పలికారు. క్రీడాకారులుగా ఎదగాలనుకుంటే సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. గ్రామస్థాయి నుండి దేశానికి ప్రతిభ కలిగిన క్రీడాకారులను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. టోక్యో పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కు రూ. 1.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలని, ధనుష్ కు ఇచ్చిన విధంగానే స్పోర్ట్స్ పాలసీ కింద జిల్లాకు చెందిన జీవంజి కు ప్రోత్సాహకాలు అందించామని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందజేస్తుందన్నారు. క్రీడలకు ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టబోతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ క్రీడలలో ప్రతిభ చాటిన క్రీడాకారిణి చికిత కు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిగా తానే స్వయంగా ఘన స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటాలని కోరారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఇతర క్రీడా సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజులు ప్రతిపాదనలు అందజేస్తే మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ* కాకతీయ విశ్వవిద్యాలయంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఇతర క్రీడా సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు. విజయ డెయిరీని ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారని డెయిరీ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రూ. 30 కోట్లను మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూరాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మైదానాలకు దగ్గరగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్పోర్ట్స్ లో ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో గత కొన్నేళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కుడా ఆధ్వర్యంలో క్రీడా సౌకర్యాలు కల్పించాలని కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని కోరారు. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శృతి, వరంగల్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్ దివ్యజ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల క్రీడాకారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

