రాష్ట్రంలో అన్ని ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లోని శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని మంత్రులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. అంతకుముందు త్రిశూలం కూడలిని మంత్రులు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లను దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆలయంలో స్వామివారు భీకర రూపం కాకుండా ముఖంపై కోర మీసాలతో దర్శనమిస్తుంటారు కాబట్టి కోర మీసాల వీరభద్ర స్వామిగా భక్తులు కొలుస్తుంటారని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం తపస్సు చేసి స్వయంభుగా శ్రీ వీరభద్ర స్వామి వెలిశారని భక్తులు నమ్ముతారని అన్నారు. కాకతీయుల కాలం నాటి వేంగి చాళుక్యులు ఈఆలయాన్ని నిర్మించారని, తదనంతరం కాకతీయ రాజైన బేతరాజు -1 ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర చెబుతుందన్నారు.విగ్రహ ప్రతిష్ట 1600 సంవత్సరం ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపైకి వంట చెరుకు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు స్వప్నంలో కనిపించారని అన్నారు. కొండపై ఉన్న స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారని కథనం ప్రాచుర్యంలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి జనవరి నెలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. లక్షలాదిమంది భక్తులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. స్వామి వారి కళ్యాణం, కుంకుమార్చన, కోడేలు కట్టడం, అగ్నిగుండం, బండ్లు తిరిగే కార్యక్రమం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయని అన్నారు. సంతానం లేని వారు కోరమీసం స్వామివారికి సమర్పించుకుంటే సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. భక్తులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారని అన్నారు. స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం వసతి సదుపాయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకుని క్షేమంగా వచ్చి ఇంటికి వెళ్లేలా సౌకర్యాలు ఉండే విధంగా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దర్శనం నిమిత్తం మూడు లైన్లు ఉండే విధంగా అధికారులను ఆదేశించామని, మహిళలు, చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు, అదేవిధంగా విఐపి, సాధారణ దర్శనాలకు దారులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతర ను ప్లాస్టిక్ రహితంగా కూడా చేయాలని భక్తులకు సూచించారు.భద్రకాళి అమ్మవారు అంటేనే ఉగ్ర స్వరూపిణి అని పేర్కొన్నారు. ఉగ్ర స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి సమేతంగా శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 70 కోట్లను ఇవ్వాలని ప్రతిపాదనలు ఇచ్చారని, మాస్టర్ ప్లాన్, అన్ని అనుమతులకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయించి ఆలయ అభివృద్ధి పనులను చేపడతామన్నారు. భద్రకాళి నుండి బాసర వరకు ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సబ్ కమిటీని వేయమని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారని అన్నారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణ పనులు, వేములవాడ మాడవీధుల నిర్మాణ పనులు సాగుతున్నాయని చెప్పారు. సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు నభూతో నభవిష్యత్తు అన్న విధంగా ఉన్నాయని అన్నారు. మేడారంలో సమ్మక్క సారక్క గిరిజన జాతర జరగబోతుందన్నారు..తెలంగాణ ప్రజలందరికీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీరభద్ర స్వామి ఆశీస్సులు అందజేస్తూ ముందుకు నడిపించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ* కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నట్లు తెలిపారు. కాకతీయ కాలంనాటి వీరభద్ర స్వామిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.

ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. చారిత్రక దేవాలయ అభివృద్ధికి గతంలోనే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను కలిసి వివరించగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. దాదాపు 70కోట్ల రూపాయలతో దేవాలయానికి సంబంధించి ప్రాకారాలు, మాఢ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు ఇచ్చి భక్తులకు ఉపయోగపడేవిధంగా పూర్తి సహకారాన్ని అందజేస్తున్నందుకు మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనే కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి కోర మీసాల దేవుడిగా, గుమ్మడికాయల దేవుడిగా, కోరిన కోరికలు తీర్చే దేవుడిగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ తమ బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖను కోరారు. మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్ రావు, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ రాజు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

