అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొత్తపేట.
కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రభల ఉత్సవం మకర సంక్రాంతి సందర్భంగా గురువారం కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో కొత్తపేట గ్రామం జనసంద్రంగా మారింది.ఎక్కడికక్కడ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.అన్ని ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాలు కనుమ రోజున జరుగుతుండగా,ఇక్కడ మాత్రం ప్రభల ఉత్సవాలు మకర సంక్రాంతి రోజున జరగడం విశేషం.
వైభవంగా ప్రభల ఊరేగింపు
గురువారం ఉదయం నుంచే కొత్తపేటలో పండుగ వాతావరణం నెలకొంది.పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుండి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు చూపరులను కట్టిపడేసింది.పాతరామాలయం, కొత్తరామాలయం కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రభల ఊరేగింపు జరిగింది.భారీ ప్రభల వెంట అనేక చిన్న ప్రభలు వరుసగా ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సంగీత నాదస్వరాలు, డప్పు వాయిద్యాల మోతలు, కళాకారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువత కేరింతలు ఉత్సవ ఉత్సాహాన్ని మరింత పెంచాయి.
ప్రభుత్వ పాఠశాల,జూనియర్ కళాశాల ఆవరణలో కొలువు దీరిన ప్రభలు
ఊరేగింపు అనంతరం అన్ని ప్రభలను కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు.వేలాది మంది భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
పోటాపోటీగా బాణసంచా ప్రదర్శనలు
ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం బాణసంచా కాల్పులు.రెండు వీధుల నిర్వాహకులు పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలతో కొత్తపేట ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. ఈ అద్భుత దృశ్యాలను ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకున్నారు.పటిష్ట పోలీస్ బందోబస్తు*
భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.




