(గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు, 73370 82570) దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలిచి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో ఇంకా కుల వివక్ష వేళ్లూనుకొని ఉండటం దురదృష్టకరం. నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. దైవదర్శనానికి వెళ్లిన ఒక నిరుపేద బీసీ రజక కుటుంబంపై అగ్రకుల నేతలు జరిపిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత అమానవీయం.ఈనెల ఫిబ్రవరి 18న కుమ్మెర గ్రామానికి చెందిన రజక (చాకలి) కులానికి చెందిన గణేష్ తన భార్య మౌనిక, తల్లి చంద్రకళ, రెండు నెలల పాపతో కలిసి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కొందరు నిర్వాహకులు (అగ్రకులానికి చెందిన స్థానిక సర్పంచ్ అనుచరులు) అక్రమంగా రూ. 100 ఎంట్రీ ఫీజు డిమాండ్ చేశారు. మల్లన్న స్వామి కొలువైన కుమ్మెర గ్రామస్తుల ఆలయ ప్రవేశానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని ప్రకటించినప్పటికీ, మళ్లీ తమను ఫీజు ఎందుకు అడుగుతున్నారని గణేష్ కుటుంబీకులు ప్రశ్నించారు. దీంతో తమనే ఎదురు ప్రశ్నిస్తారా? అని ఆగ్రహించిన సర్పంచ్ అనుచరులు రెచ్చిపోయారు. గణేష్ కుటుంబీకులను కులం పేరుతో దూషిస్తూ వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తమ కుటుంబంపై దాడి చేయవద్దని బతిమాలుతూ కాళ్లావేళ్లా పడ్డ మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. గణేష్ ను ఒక గదిలో బంధించి, చిత్రహింసలకు గురిచేస్తూ, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తన భర్త గణేష్ ను వదిలేయాలని అతని భార్య మౌనిక తన పసిబిడ్డను నిందితుల కాళ్ల వద్ద పెట్టి వేడుకున్నది, అయినా కనికరం లేని నాయకుల మనసు కరగలేదు. చివరికి కర్కష మనస్కులైన వారిలోని ఒక వ్యక్తి కోపంతో మౌనిక కూతురైన రెండు నెలల చిన్నారిని కాలితో తన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మరణించింది.అయితే, అప్పుడు అక్కడే ఉన్న పోలీసులు ఈ దారుణాన్ని ఆపలేదు, బాధితులకు అండగా నిలవలేదు, పైగా నిందితులకే కొమ్ముకాశారు. చివరకు బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. అధికార పక్ష నాయకుల అండ చూసుకునే అగ్రకుల నాయకులు బడుగు, బలహీనvవర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి, పసికందును బలిగొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులపై సెక్షన్ 302 కింద హత్యా నేరం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటుగా, ఆ నిరుపేద కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇదే సమయంలో బీసీలపై కుల వివక్షకు పాల్పడుతున్న అగ్రకుల దురహంకారులపై ఉక్కుపాదం మోపాలి. బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన తక్షణ అవసరం ఉంది.

