Jaibharathvoice.com | Telugu News App In Telangana
శ్రీకాకుళం

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ

జై భారత్ వాయిస్ న్యూస్ శ్రీకాకుళం మార్చి 29: తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన మహత్తర రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగిన 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఘనంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు, కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని అన్నారు.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు”అనే సిద్ధాంతం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు.పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన సంక్షేమ పాలనకు ఆయన నాంది పలికారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ఆశయాలు… చంద్రబాబు విజన్ …లోకేష్ నాయకత్వం
ఎన్టీఆర్ చూపిన దారిలోనే నారా చంద్రబాబు నాయుడు  రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని మంత్రి కొనియాడారు. సాంకేతికత,పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం అదే స్పూర్తితో మంత్రి నారా లోకేష్ యువ నాయకుడిగా పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని అన్నారు. యువతను ఆకర్షిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు.
కార్యకర్తలే పార్టీ బలం..
43 ఏళ్లుగా పార్టీ విజయగాథకు కార్యకర్తల త్యాగాలు, అచంచల నిబద్ధతే మూలం అని మంత్రి పేర్కొన్నారు. ఎన్ని సవాళ్లు వచ్చినా “జై తెలుగుదేశం” నినాదంతో ముందుకు సాగడం కార్యకర్తల ప్రత్యేకత అని అన్నారు. పార్టీ కోసం కష్టకాలాల్లోనూ అండగా నిలిచిన సీనియర్ కార్యకర్తలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
టెక్కలిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాం
టెక్కలి నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు, ఉపాధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
శ్రీకాకుళం  జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి
స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో జిల్లాలో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాల మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.612 కోట్ల భారీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని చెప్పారు.
నా జీవితం పార్టీకి అంకితం
తన కుటుంబం తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వానికి అంకితమై ఉందని మంత్రి స్పష్టం చేశారు. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేయడం తమ సిద్ధాంతమని తెలిపారు. పార్టీ కార్యకర్తల త్యాగం, కష్టసాధన ఫలితమే నేడు అధికారంలోకి రావడం సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. వైకాపా పాలనలో ఎదురైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్త సేవలు అమూల్యమని కొనియాడారు.