జై భారత్ వాయిస్ న్యూస్ న్యూఢిల్లీ/అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిధుల సాధనే లక్ష్యంగా, అభివృద్ధి పనుల ఆమోదమే మార్గంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన నివాసంలో మంత్రి దుర్గేష్ కలిశారు. ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించారు.రాష్ట్రంలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల బలోపేతం కోసం మంత్రి కందుల దుర్గేష్ చేసిన విన్నపాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త ప్రాజెక్టులతో పాటు, తెలుగు భాష మరియు కళల పరిరక్షణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 6 కీలక సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన కృషి ఫలితంగా శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సిబిడిడి వంటి పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 430 కోట్లు కేంద్రం మంజూరు చేయగా వాటి పురోగతిని వివరించి త్వరితగతిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించగా సానుకూలంగా స్పందించారు. మంత్రి దుర్గేష్ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
కీలక ప్రతిపాదనలు మరియు నిధుల విజ్ఞప్తి:
ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మంత్రి కందుల దుర్గేష్ నూతన ప్రాజెక్టుల సాధన దిశగా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. అందులో ప్రధానంగా ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ పథకాల కింద రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, బీచ్‌ల అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు చేసిన ప్రయత్నంలో మంత్రి దుర్గేష్ విజయం సాధించారు.
ఆధ్యాత్మిక పర్యాటకం: ప్రసాద్ పథకం కింద మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (రూ. 95.18 కోట్లు), అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం (రూ. 213.72 కోట్లు), వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం (రూ. 120 కోట్లు), కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (రూ. 36 కోట్లు), నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి ఆలయం (రూ. 48.95 కోట్లు) అభివృద్ధికి నిధులు కోరారు.బీచ్ మరియు ప్రకృతి పర్యాటకం, చారిత్రక ప్రాధాన్యత: మచిలీపట్నంలో వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 120.04 కోట్లు, లంబసింగిలో పర్యాటక అనుభూతిని మెరుగుపరిచే పనులకు రూ. 99.87 కోట్లు, బౌద్ధ క్షేత్రాల వద్ద టెంట్ సిటీల ఏర్పాటుకు రూ. 77.32 కోట్లు, లేపాక్షిలో పర్యాటక సౌకర్యాలు,సాంస్కృతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 103.05 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సాంస్కృతిక పునర్జీవానికి మంత్రి దుర్గేష్ కృషి
సూర్యరాయ నిఘంటువు: 1936-1974 మధ్య ఎనిమిది సంపుటాలుగా వెలువడిన ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుగు భాషా చరిత్రలో ఒక అద్భుతమైన గ్రంథమని, ఇందులో 1.1 లక్షలకు పైగా పదాలు ఉన్నాయని, పాత కాలపు ముద్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం ఇది చదువరులకు కష్టంగా మారిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలుగు భాషా వారసత్వ సంపద అయిన ‘సూర్యరాయ నిఘంటువు’ను ఆధునిక సాంకేతికతతో, కొత్త ఫాంట్లతో తో పునర్ముద్రించాలని కేంద్ర మంత్రితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చినప్పటికీ కార్యరూపం తీసుకొచ్చేందుకు మంత్రి దుర్గేష్ తీసుకున్న చర్యలు సఫలీకృతమవుతున్నాయి.
విద్యా సంస్థల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్ పద్య నాటకం, సురభి థియేటర్, వీధి నాటకం వంటి గొప్ప రంగస్థల కళలకు నిలయమని, జాతీయ స్థాయిలో గుర్తిం,సరైన శిక్షణ సంస్థలు లేక ఈ కళలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయని వివరించి రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటును త్వరితగతిన ఆమోదించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్ ఎస్ డీ అధికారులు రాజమండ్రిలో స్థల పరిశీలన పూర్తి చేసిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. దీనిని త్వరితగతిన పట్టాలెక్కిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా శీలాభీడే కమిటీ సిఫార్సు మేరకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్ ప్రిటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పర్యాటక భవన్) ఏర్పాటుకు రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ (NIH) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
అకాడమీల ఏర్పాటు: లలిత కళలను ప్రోత్సహించడంతో పాటు నూతన కళాకారులకు సరైన వేదికను అందించవచ్చనే ఉద్దేశంతో విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, యోగి వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి మహామహులైన కవుల వారసత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడానికి ఏపీలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం, కూచిపూడి నృత్యం, గొప్ప చారిత్రక సాహిత్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) బ్రాంచ్ ఏర్పాటు చేయాలని మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.అందుకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తద్వారా రాష్ట్ర కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం లభిస్తుందని వివరించారు.. 16 విశ్వవిద్యాలయాలు, 100 ఇంజనీరింగ్ కళాశాలలు, 12 వైద్య కళాశాలలతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు విద్యా మార్పిడికి కేంద్రంగా ఉందని రాష్ట్ర వైభవాన్ని తెలిపారు.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సంగీత, నృత్య ఉత్సవాలు నిర్వహించడానికి తగిన స్థాయి ఆడిటోరియం అందుబాటులో లేదని,ఈ క్రమంలో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు (GVR) సంగీత మరియు నృత్య కళాశాలలో ‘కళాక్షేత్ర’ ఆడిటోరియం నిర్మిస్తే, అది కళాకారులకు మరియు విద్యార్థులకు గొప్ప వేదికగా మారుతుందని కేంద్రానికి విన్నవించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు.అంతర్జాతీయ డెస్టినేషన్లుగా తిరుపతి,విశాఖ: రాష్ట్రంలోని తిరుపతి,విశాఖపట్నంలను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్లుగా తీర్చిదిద్దాలని అందుకు అవసరమైన నిధుల సాయం చేయాలని మంత్రి దుర్గేష్ కోరారు.ఈ సిటీలను దేశంలోని 50 అత్యుత్తమ పర్యాటక కేంద్రాల జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. “భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉమ్మడి లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆమోదం తెలపడం సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఏపీని పర్యాటక హబ్‌గా మార్చేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుండి పూర్తి మద్దతు లభించిందని భావిస్తున్నాం.కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల బలోపేతం, రవాణా సౌకర్యాల మెరుగుదల, పర్యాటకుల అనుభూతిని పెంపొందించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది..తద్వారా పర్యాటకుల రాక పెరగడమే కాకుండా, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది.ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.” అని మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వారసత్వ అభివృద్ధికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ పర్యాటక ప్రాజెక్టుల అమలుపై మంత్రి కందుల దుర్గేష్ స్పెషల్ ఫోకస్.. కేంద్ర సెక్రటరీలతో కీలక భేటీలు..ప్రతిపాదనలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావాలని కోరిన మంత్రి దుర్గేష్ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదనలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అమలును వేగవంతం చేయడంపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది కేంద్ర మంత్రి అయినప్పటికీ, వాటిని అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమని గుర్తించిన మంత్రి దుర్గేష్ ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన అనంతరం కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ సెక్రటరీ సుమన్ బిల్లాను, కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ వివేక్ అగర్వాల్ ను మంత్రి దుర్గేష్ కలిసి కీలక ప్రాజెక్టులపై చర్చించి వాటి పురోగతిని వివరిస్తూ త్వరితగతిన వీటికి కార్యరూపం తీసుకురావాలని కోరారు. కేంద్రమంత్రికి ఇచ్చిన ప్రతిపాదనలు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లు అత్యంత పకడ్బందీగా ఉన్నాయని పేర్కొన్న సెక్రటరీలు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక రంగాలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి దుర్గేష్ అన్నారు. పర్యాటక ప్రాజెక్టుల రూపకల్పన, అమలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు త్వరలోనే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి చర్చా వేదికను (చింతన్ శిబిరం) నిర్వహిస్తోందని, ఈ ప్రతిష్టాత్మక శిబిరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా ఆహ్వానం పంపిస్తామని, అక్కడ ఏపీ ప్రాజెక్టులపై మరింత లోతుగా చర్చించి తుది ఆమోద ముద్ర వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా మంత్రి దుర్గేష్ వెల్లడించారు. “కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాలసీల విషయంలో సానుకూలంగా స్పందించారు. వాటిని కార్యరూపంలోకి తీసుకురావాల్సిన సెక్రటరీలను కలిసి ప్రాజెక్టుల పురోగతిని వివరించాను. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని వారు సుముఖత వ్యక్తం చేయడం సంతోషంగా ఉంది. భువనేశ్వర్ చింతన్ శిబిరం ఏపీ పర్యాటక రంగానికి ఒక మైలురాయి కాబోతోంది” అని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.

