(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ) ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ సభలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ కావేటి కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి తగిన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ఇందిరమ్మ రాజ్యం’ వస్తుందని నమ్మి ప్రజలు తమను గెలిపించారని, ఆ విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నిరుపేదలు, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ఈ పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తూ, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను కూడా తరచుగా తనిఖీ చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశముందని, దీంతో మహిళలకు మరిన్ని రాజకీయ అవకాశాలు లభిస్తాయని అన్నారు.పట్టణాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, తడి–పొడి చెత్తను వేరు చేయాలని, శానిటేషన్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని మంత్రి సూచించారు. జీడబ్ల్యూఎంసీ స్వచ్ఛత యాప్‌పై ప్రజల్లో అవగాహన పెంచి వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. వీధి వ్యాపారులు పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి వివరించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అంగన్వాడీ నుండి కళాశాల స్థాయి వరకు విస్తరించడం, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మందికి రక్షణ కల్పించడం, కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం వంటి నిర్ణయాలు ప్రజలకు భరోసానిస్తాయని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించడం ద్వారా విద్యార్థుల పోషకాహారం మరియు హాజరు శాతం పెరుగుతాయని అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు మోటారు సైకిళ్లు, ట్రైసైకిళ్లు అందజేయడం, పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించడం, పట్టణాల్లో మిద్దె తోటలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతోందన్నారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండటం ఆనందదాయకమని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణలో అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మార్చి 6 నుండి 15 వరకు శానిటేషన్ డ్రైవ్‌లు నిర్వహించామని, వాటర్ ట్యాంక్‌ల శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఏప్రిల్ 6 నుండి జూన్ 12 వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్), ఎంహెచ్ఓ డా. రాజేష్, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

