జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ (తూర్పు) నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అమృత్ 2.0 పథకం కింద రూ. 6 కోట్ల వ్యయంతో చిన్న వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల పునరుద్ధరణ, పునర్జీవన పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణాల్లో చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పర్యావరణ పరిరక్షణ, నగర సౌందర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. చెరువులను శుభ్రపరిచి ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఉర్సు రంగసముద్రం, దేశాయిపేట చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని చెప్పారు.వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి మేయర్, కమిషనర్, కలెక్టర్ల సమన్వయంతో కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేస్తూ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, సీఎం బ్రేక్‌ఫాస్ట్, రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా వంటి కార్యక్రమాలను అమలు చేయబోతున్నట్లు వివరించారు.టెక్స్టైల్ పార్క్ నేపథ్యంలో స్థానిక మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆధునాతన యంత్రాలపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణతో పర్యావరణ సమతుల్యత కాపాడబడటమే కాకుండా ప్రజలకు శుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పనులు నగరాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు సురేష్ జోషి, మరుపల్ల రవి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

