జై భారత్ వాయిస్ ఆత్మకూర్
హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం రెవెన్యూ గ్రామంగా ప్రకటించేందుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, స్థానిక అధికారులతో కలిసి గురువారం ఉదయం సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ విజయ సభాధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామసభలో అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. గ్రామస్థుల విన్నపం మేరకు అక్కంపేట ను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపుటకుగాను ఆదేశాలు అందాయని అన్నారు. ఆ ఆదేశాల మేరకు గ్రామసభ ను నిర్వహించి, గ్రామసభ ఆమోదించిన తీర్మానాన్ని తక్షణమే ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. అక్కంపేట గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ గ్రామంలో 3432 మంది జనాభా ఉన్నారని, 857 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎస్సీలు 633 మంది, ఎస్టీలు 24మంది, ఇతరులు 2775 మంది ఉన్నారని తెలిపారు . అక్కంపేట గ్రామపంచాయతీగా ఏర్పడక ముందు ఈ గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉండేదని, పెద్దాపూర్ గ్రామపంచాయతీ నుండి 1981లో విభజించి అక్కంపేటను గ్రామపంచాయతీ గా ఏర్పాటైనట్లు చెప్పారు. కాగా అక్కంపేట గ్రామం రెవెన్యూ గ్రామంగా ఆమోదం పొందనున్న నేపథ్యంలో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
previous post