కుందుర్పి జై భారత వాయిస్
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కురుబ ముక్కన్న పేర్కొన్నారు. పోస్టల్ ఉద్యోగిగా తన పదవికి రాజీనామా చేసి సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించడమే లక్ష్యంగా సమాజ హితం కోసం రానున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాను సాటి మనిషికి మానవత్వంతో సహాయం చేయాలని ఉన్నతాశయంతో వికలాంగురాలైన మహిళను ఆదర్శ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. సమాజంలో రాజకీయ నాయకుల ఊబిలో చిక్కుకుని అమాయకంగా మోసపోతున్న ప్రజలకు బాసటగా నిలిచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతోనే స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ రంగం ద్వారానే ప్రజలకు శక్తివంతమైన సేవలను అందించగలననే అభిప్రాయంతోనే రానున్న ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.