ఆత్మకూరు లో అసంఘటిత కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ సిఎస్సి హెల్త్ కేర్ సంయుక్తంగా అసంఘటిత కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షా శిబిరం నిర్వహించారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో అసంఘటిత కార్మికులకు 52 రకాల వివిధ వైద్య పరీక్షలను నిర్వహించేందుకుగాను కార్మికుల నుండి రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డిస్టిక్ కో ఆర్డినేటర్ వి.హరీష్, క్యాంపు కోఆర్డినేటర్ ఎం .నాగరాజు మాట్లాడుతూ కార్మికుల దగ్గర నుండి సేకరించిన రక్త నమూనాలను లేబొరేటరీలలో పరీక్షించి వారం రోజులలో సెల్ ఫోన్ ద్వారా సంక్షిప్త సమాచారం ఇవ్వబడుతుందని, అనంతరం రిపోర్ట్స్ ను జి పి కార్యాలయంలో వద్ద తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా కార్మికులకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని వాటిని పరీక్షల ద్వారా తెలుసుకున్నప్పుడు సత్వరమైన చికిత్స తీసుకోవచ్చని దీంతో ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని సూచించారు. ముఖ్యంగా కార్మికులకు రక్తపోటు, మధుమేహం వచ్చినట్లు చాలామందికి తెలియదని, అది కేవలం పరీక్షలు చేసినప్పుడే తెలుస్తుందని తద్వారా డాక్టర్లను సంప్రదించి ఔషధాలు స్వీకరించినప్పుడు ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెల్త్ కేర్ సిబ్బంది ఎన్. కిషోర్, వి. సాయికుమార్ ,బి భరత్, ఏ సందీప్, బి.భావన ,ఎండి కరిష్మా తదితరులు పాల్గొన్నారు.