రిపోర్టర్ జ్యోతి
(జై భారత్ వాయిస్ హనుమకొండ:) వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో మీడియా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్కు కు చేరుకుంటారని అన్నారు. టెక్స్టైల్ పార్కులో ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలిస్తారని పేర్కొన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్కు సందర్శన అనంతరం పూర్వ సెంట్రల్ జైల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలిస్తారని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షిస్తారని అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని అభివృద్ధిపైమంత్రులు,ప్రజా ప్రతినిధులు,కలెక్టర్లు,ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తారని తెలిపారు. హైదరాబాద్ తర్వాతపెద్ద నగరమైన వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దీనికి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీగా, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రంగాలలో వరంగల్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కుడా పరిధిలోని ఇతర జిల్లాల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్లో సమావేశాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసారని అన్నారు..వరంగల్ ఫైనల్ మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ తో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే సమావేశంలో ఎజెండాలోని అంశాలను సమగ్రంగా చర్చిస్తారని పేర్కొన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పై మొదటి అంశంగా చర్చించనున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం నిధులతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేపట్టెందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా శక్తి రుణాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.దశల వారిగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్, కాళోజీ కళాక్షేత్రంపై కూడా చర్చించే అంశాల్లో ఉన్నాయని పేర్కొన్నారుకలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రుల సమావేశం మీడియా సమావేశానికి ముందు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే,ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు కొండా సురేఖ, డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.