May 17, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి*

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి. పోడు భూముల సమస్యలపై అధికారులు లోతైన అధ్యయనం చేపట్టి, లోటుపాట్లను వెలికితీసి, పోడు భూముల సమస్యలన్నింటికి శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖామాత్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణను నివారించి, సహృద్భావ వాతావరణ నెలకొనేలా విధివిధానాలు రూపొందించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోడు భూములు విస్తరించి ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలు జిల్లాల కలెక్టర్ లు, ఐటిడిఎ పిఓలు, డిఎఫ్ఓలు తదితరులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన పోడు భూముల వివరాలు, పోడు హక్కులు, తగాదాలు, అడవులు ఆక్రమణ తదితర అంశాల పై చర్చించారు.ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, పిసిసిఎఫ్(వైల్డ్ లైఫ్) ఏలుసింగ్ మేరు, సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ సెక్రటరీ శ్రీలక్మి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎ. శరత్, ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ట్రైబల్ కల్చరల్ రీసర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ జాయింట్ డైరక్టర్ సముజ్వల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, పోడు భూముల సమస్యపై సమగ్ర అధ్యయనం చేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ? ఎంతమందికి పోడు పట్టాల పంపిణీ జరిగింది? పోడు పట్టాలు పొందిన వారిలో అనర్హులెవరైనా ఉన్నారా ? స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని? తదితర అంశాల పై ఆయా జిల్లాల కలెక్టర్లు సునిశిత పరిశీలన చేపట్టి నివేదిక రూపొందించాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు భూముల వివరాలను మంత్రి సురేఖ అధికారులను ఆరా తీయగా, ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్ (ఐ ఎఫ్ ఆర్) కింద 6,51,822 దరఖాస్తులు రాగా 2,30,735 మంది పట్టాదారులకు 6,69,676 ఎకరాల పోడు భూమి పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటి ఫారెస్ట్ రైట్స్ (సీ ఎఫ్ ర్) కింద 3,427 దరఖాస్తులు రాగా, 721 దరఖాస్తుదారులకు పట్టాలు అందించగా, పలు కారణాలతో 1,024 దరఖాస్తులను పెండింగులో పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోడు భూములపై హక్కుల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్లైన్ లో నమోదుకావాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో తిరస్కరణకు కారణాలను వివరించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.అటవీ భూములు, రెవెన్యూ భూముల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటి వేసి సమస్యను పరిష్కరించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (ఓ టీ ఎఫ్ డి) కేటగిరీలో పోడు భూములు పొందిన గిరిజనేతర లబ్ధిదారుల వివరాలను పునః పరిశీలించాలని మంత్రి సురేఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమీక్షా సమావేశానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటు, ఆర్మూల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనుల పోడు భూముల హక్కులు, అడవుల ఆక్రమణ, అటవీ భూముల గుండా రవాణాకు సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కొండా సురేఖతో ప్రస్తావించారు. ఈ సందర్భంగా అటవీభూముల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ అధికారులను మంత్రి సురేఖ మందలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలను ఆయా జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, డిఎఫ్ఓలు సమన్వయంతో వ్యవహరిస్తూ పరిష్కరించాలని సూచించారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అడవులు, గిరిజనుల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటిడిఎల పిఓలు, డిఎఫ్ఓలు సామరస్య పూర్వకంగా, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అటవీ భూముల్లో మౌలిక సౌకర్యాల కల్పన సమయంలో అడవుల రమణీయత దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం దిశగా ఆదర్శవంతమైన విధి విధానాలను రూపొందించాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశాన్ని నిర్వహించి, మార్గదర్శకాలకు ఆమోదం లభించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

Related posts

అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు

రైతులకు రక్షణగా ముఖ్యమంత్రి కేసీఆర్

తూర్పు కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

Sambasivarao
Notifications preferences