Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

షరతుల్లేకుండా రుణ మాఫీ చేయాలి..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ జిల్లా ప్రతినిధి:-
కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని వాపోయారు. వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎదుటివారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశలో కొట్టుమిట్టాడు తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్నీ అమలు చేసిచూపించిందని, దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిందని కొనియాడారు. ఇన్ని చేసిన కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారన్న ఆలోచనతోనే రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో 40 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, క్యాబినెట్‌లో మాత్రం 31 వేల కోట్లు కేటాయించారని, బడ్జెట్‌లో 17 వేల కోట్లు కేటాయించారని, తీరా చూస్తే 7500 కోట్లు మాత్రమే మాఫీ చేశారని, ఇదెక్కడి లెక్క అని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తిగా చేశామని రేవంత్‌రెడ్డి ప్రకటనలు చేస్తున్నారని, మరోవైపు ఆర్థిక మంత్రి ఇంకా చేయలేదు, చేస్తున్నామని మాట్లాడుతున్నారని, ఖమ్మంలో మరో మంత్రి 30 శాతం మందికే ఇచ్చామని, ఇంకా చేస్తామంటున్నారని, మాఫీ లెక్కలపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సీజన్‌ ప్రారంభంలో రోహిణి కార్తెలో రైతులకు రైతుబంధు అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ మాత్రం పంట కోతల సమయంలో ఇచ్చిందని, ఈ యేడాది ఇంత వరకు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు, రైతులందరూ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి తప్పు చేశామని బాధపడుతున్నారని, తాము ఎక్కడికి వెళ్లినా ఇదే విషయాన్ని మాట్లాడు తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం అంతకంటే ముఖ్యమని, కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ అమలు చేసేదాకా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధర్మారం పాఠశాలలో పిఆర్టీయూ సభ్యత్వం నమోదు

Sambasivarao

ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు సందర్శన

Sambasivarao

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం