జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 హనుమకొండ
ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు
తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు సన్మాన మహోత్సవ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానమనే వెలుగులు నింపేవారే ఉపాధ్యాయులని అలాంటి ప్రైవేట్ గురువుల పరిస్థితి దినదిన గండంగా మారిందని ఎంపీ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటూ ప్రైవేట్ టీచర్లకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక, శ్రమ దోపిడీకి యదేచ్ఛగా పాల్పడుతున్న ప్రైవేట్ యాజమన్యాలు టీచర్ల పట్ల మానవీయ కోణంలో ఆలోచించాలని హితవుపలికారు. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని, పేరెంట్స్ జేబులు పిండి 12 నెలల ఫీజు వసూలు చేసి టీచర్లకు మాత్రం పది నెలల జీతాలను మాత్రమే ఇస్తున్నాయన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆస్తులను పెంచుకుంటూ ప్రైవేటు గురువులకు మాత్రం జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. భద్రత లేని ఉద్యోగంతో భయంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు జీవితాన్ని వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇందిరమ్మ ఇళ్ళతో పాటు, హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రైవేట్ విద్యా సంస్థల గురువులకు వేతనాలను కూడా పెంచాలని, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ నీలా సుష్మా రెడ్డి, యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

next post