*సీతారాం ఏచూరి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు*
హన్మకొండ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 హనుమకొండ ప్రతినిధి:-
ప్రజా సమస్యలపై జీవితాంతం పోరాటం చేసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకే తీరని లోటు అని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి తిరుపతి అన్నారు. పరకాల అమరధామంలో ఏచూరి చిత్రపటానికి పరకాల జేఏసీ చైర్మన్ సిరికొండ శ్రీనివాసచారి, కన్వీనర్ ఎడ్ల సుధాకర్, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు, ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే విద్యారంగ పరిరక్షణ కోసం సమాజ మార్పు కోసం, పోరాటాలు చేసిన ఆయన, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై, అనునిత్యం పోరాటం చేసిన, ఆయన పోరాటాలు చిరస్మరణీయమని, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా, పోరాటాలు చేసిన, మతోన్మాద విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ రక్షణ, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం జీవితాంతం కృషిచేసిన ఏచూరి జీవితం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓ. చిరంజీవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్, ప్రజాసంఘాల నాయకులు మాటూరు సతీష్, రాజు, అనిల్, కుమారులు పాల్గొన్నారు.