జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 వరంగల్
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ నగరంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని విశ్వకర్మవీధిలోని విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనములో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాయజ్ఞంతో పాటు, రామన్నపేటలో విశ్వకర్మ కార్పెంటర్స్ డెవలప్ మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. యజ్ఞస్థలికి చేరుకున్న మంత్రికి కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా సాదర స్వాగతం పలికారు. శాలువా, పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో, వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన యజ్ఞంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. యజ్ఞానికి హాజరైన పలువురికి మంత్రి సురేఖ తన స్వహస్తాలతో కంకణాలు కట్టారు. పలువురు మంత్రి సురేఖతో కలిసి ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే, అభీష్టాలను నెరవేర్చే యజ్ఞాలు అత్యంత పవిత్రమైనవని అన్నారు. ప్రతి యేటా విశ్వకర్మలు నిర్వహించే యజ్ఞాలు సానుకూల దృక్పథాన్ని కలిగించడంతో పాటు, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని తెలిపారు. భక్తి ప్రపత్తులతో, నిష్ఠతో చేపట్టే యజ్ఞాలు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు, సమాజానికి మంచి కలుగజేస్తాయని అన్నారు.
next post