దేశ జనాభాలో సగాభాగానికి పైగా ఉన్న మనకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మన న్యాయమైన వాటా, హక్కుల సాధనకు మరింత ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల సంక్షేమం, సముద్ధరణ, ఆయా రంగాలలో రిజర్వేషన్స్ అమలు తదితర అంశాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాలలో పర్యటించాలని నిర్ణయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షులు కే చంద్రశేఖరరావు మార్గనిర్దేశనం, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు ఆ పార్టీకి చెందిన అందుబాటులో ఉన్న బీసీ నాయకులు సమావేశమయ్యారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో శాసనమండలిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమంలో బీసీలు అగ్రభాగాన నిలిచిన విషయాలను గుర్తు చేసుకున్నారు. న్యాయమైన, ధర్మమైన మన హక్కుల్ని, వాటాను దక్కించుకునేందుకు తెలంగాణ ఉద్యమం స్పూర్తితో మేమెంతో మాకంతా, మా వాటా మాకే, అనే నినాదాలతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మంత్రిమండలిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశమివ్వడం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మన హక్కుల కోసం పోరుబాట పట్టడం ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. చట్టసభలలో 33% స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్, డాక్టర్ చెరుకు సుధాకర్, నోముల భగత్, చిరుమళ్ల రాకేష్, ఆంజనేయులు గౌడ్, మరికల్ పోత సుధీర్ కుమార్, ఉపేంద్రాచారి, కిశోర్ గౌడ్, శుభప్రద పటేల్, బాలరాజ్ యాదవ్, ఆలకుంట హరి తదితరులు హాజరయ్యారు.