(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23)
హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, కెజీబీవీలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు అందించే భోజనం పై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.అంతకు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడారు. వివిధ శాఖల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, తదితర అన్ని సంస్థలలో ఆహారాన్ని అందించేందుకు ప్రమాణాలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అదేవిధంగా మల్టీ డిసిప్లనరీ టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేసి గత రెండేళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగిన హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి సంఘటనలు గల కారణాలను, సమస్యలకు పరిష్కారాలు చూపాలన్నారు. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లతో కూడిన ఫుడ్ సేఫ్టీ టీం ను ఏర్పాటు చేయాలని, అందులో పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులను కూడా చేర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని , ఆహార పదార్థాల నిల్వ , వంట పాత్రలను శుభ్రం చేయడం, ఆహారాన్ని వడ్డించడం వరకు క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేయాలని జిల్లాల కలెక్టర్లను సి ఎస్ ఆదేశించారు. భవిష్యత్తులో హాస్టళ్ల లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ భోజనం అందించే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలన్నారు. వంట పాత్రలు, వంట వండే ప్రాంతం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలన్నారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన పౌష్టికాహార భోజనం పై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. 107 అన్నిరకాల హాస్టల్స్ భోజనం అందించే విధానాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారులతో ప్రతిరోజు పరిశీలించి నివేదికను అందజేయాలన్నారు. పాఠశాల, హాస్టల్స్ లో భోజనం, తాగునీరు, పరిశుభ్రత, టాయిలెట్స్ నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, వంట చేసే ప్రాంతంలో పరిశుభ్రత పాటించేలా, టాయిలెట్స్ నిర్వహణ బాగుండేవిధంగా పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించాలని డీఈవో వాసంతిని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత హాస్టల్స్ ఉన్న పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ఎంపిడీవోలు, తహసీల్దార్లు వాటిని పర్యవేక్షించాలన్నారు. హాస్టల్స్ ను మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని, అంగన్వాడీ కేంద్రాలను సంబంధిత సూపర్వైజర్లు, సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు హాస్టళ్లను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. దీనిలో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో ఉన్న వంట సామగ్రి తో పాటు వంటగదిని పరిశీలించారు. హనుమకొండలోని ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ ను జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ సీఈవో విద్యాలత హనుమకొండ లోని తెలంగాణ మైనార్టీ బాలికల పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాలరాజు ఒగ్లాపూర్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, పరకాల లోని ఎస్సీ బాలికల పాఠశాల కళాశాల, హనుమకొండలోని మైనారిటీ బాలుర పాఠశాల కళాశాలలను తనిఖీ చేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మల్లయ్య వేలేరు మండలంలోని కేజీబీవీ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీలత కాజీపేట లోని బీసీ బాయ్స్ హాస్టల్ తో పాటు హనుమకొండ లోని బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో వై. వి. గణేష్, బీసీ వెల్ఫేర్ డీడీ రాం రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, గురుకులాలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.

previous post