May 2, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

తెగించి దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది… గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు,

గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు, 73370 82570) తెగించి దీక్ష చేస్తేనే.. తెలంగాణ స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆరు దశాబ్దాల స్వరాష్ట్రం కల నెరవేరడం కోసం, సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. 2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేపట్టిండు. ప్రాణత్యాగానికి సిద్ధపడి 11 రోజులపాటు మొక్కవోని దీక్ష  కొనసాగించిండు. దీంతో కేంద్రం దిగివచ్చింది. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చింది. ఈ సందర్భంగా ఒక్కో సంఘటనను గుర్తు చేసుకుంటే…
•       తొలినుంచీ తెలంగాణ వ్యతిరేకి అయిన అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తన తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. నీళ్లు, నిధులను సీమాంధ్రకు తరలించడానికి మరిన్ని ప్రణాళికలు సిద్దం చేశారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేసీఆర్ ఈ సారి వరంగల్ జిల్లా గురిజాలలో పల్లెనిద్ర కార్యక్రమం మొదలుపెట్టారు.
•       తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు చెప్పడంతో పాటు, తెలంగాణ ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ను నిలదీసే కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. ఈ పని జరుగుతుండగానే, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోశయ్య ప్రభుత్వం కూడా తెలంగాణ వ్యతిరేక విధానాలను కొనసాగించింది. దీంతో కేసీఆర్ మరోసారి ఉద్యమాన్ని తీవ్రం చేయాలనుకున్నారు.
•       610 జీవోను అమలు చేయాలని, హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పరిగణించే 14 ఎఫ్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో టిఆర్ఎస్ 2009 అక్టోబర్ 28న జైల్ భరో కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ స్వయంగా పాల్గొని అరెస్టయ్యారు. ఆ సందర్భంగానే కేసీఆర్ కఠోర నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం అంతిమపోరు చేయాలని నిర్ణయించారు.
•       ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష ప్రారంభమయింది. సిద్దిపేటలో దీక్ష చేయడానికి కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ను అలుగునూరు చౌరస్తా దగ్గరే అరెస్టు చేసి, ఖమ్మం జైలుకు తరలించారు. కేసీఆర్ అరెస్టుతో తెలంగాణ భగ్గుమన్నది. ఊరూ వాడా కదిలింది. యూనివర్సిటీలు రణక్షేత్రాలయ్యాయి. కేసీఆర్ ను అరెస్టు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన చెందిన యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో శ్రీకాంతచారితో ప్రారంభమయిన బలిదానాలు ప్రతీ రోజు కొనసాగాయి. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు రోడ్లమీదికొచ్చారు. ప్రభుత్వం పోలీసులను వినియోగించి ఉద్యమకారులపై ఎక్కడికక్కడ లాఠీచార్జీలు చేసింది. భాష్పవాయువులు ప్రయోగించింది. కాల్పులు జరిపింది. యూనివర్సిటీ గేట్లను మూసేసి దిగ్బంధించింది.

కేసీఆర్ దీక్షను విరమింపచేయడానికి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది. దీక్ష విరమించుకున్నాడంటూ కుతంత్రం చేసింది. ఆ పన్నాగాలన్నింటినీ బద్దలు కొడుతూ కేసీఆర్ దీక్ష కొనసాగించారు. ముద్ద ముట్టకుండా పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు. చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు కేసీఆర్. దీక్ష కొనసాగిస్తే బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెబితే… అయితే జైత్రయాత్ర.. లేకుంటే శవయాత్ర అని నినదించారు కేసీఆర్. ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ తరలించిన తర్వాత కూడా దీక్ష ఆగలేదు. జనాగ్రహం రోజురోజుకు పెరిగింది.
•       అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై వత్తిడి అంతకంతకూ రెట్టింపయింది. టిడిపి నాయకులను కూడా జనం నిలదీస్తున్నారు. నాయకులు అడుగు బయట పెట్టలేని స్థితి. జనమంతా కేసీఆర్ కు అండగా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ తప్ప ఏమీ కోరుకోవడం లేదు. తెలంగాణ ప్రకటన వస్తే తప్ప దీక్ష ఆగదని తెగేసి చెపుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చింది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వాల్సిందే అని కోరారు. అటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. కోర్ కమిటీ దాదాపు నాలుగైదు సార్లు సమావేశమయింది. అటు కేసీఆర్ దీక్ష పదకొండు రోజులకు చేరుకుంది. కేసీఆర్ ప్రాణాలకేమైనా జరిగితే తెలంగాణ అగ్గయి రాజుకుంటుందనే సంకేతాలు కూడా కేంద్రానికి పోయాయి. ఇచ్చిన మాట తప్పామనే అపవాదు ఎందుకని కేంద్రం కూడా అనుకుంది. ఆ సందర్భంలోనే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ నాయకులతో సహా అందరూ కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అని పిలిచారు.
ఉద్యమ నాయకుడే స్వరాష్ట్ర సారథి అయ్యాడు. సాధించిన తెలంగాణకు తానే సారథ్యం వహించాడు. అన్నిరంగాల్లో అరవై ఏండ్లపాటు విధ్వంసం జరిగి,  అరిగోస పడ్డ తెలంగాణను పదేండ్లలోనే పచ్చబడేశాడు కేసీఆర్. దశాబ్ద కాలపు అత్యల్ప సమయంలోనే కేసీఆర్, దేశంలోనే మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాడు.

Related posts

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

బీసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్స్ ధ్యేయంగా ముందుకు సాగుదాం:

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

Notifications preferences