తిరుపతి: జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం అనే వాదనలో పసలేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎవరికి ఓటు వేయాలి అన్న విచక్షణ ఓటర్లకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనపై, అభివృద్ధిపై నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల సమయము, వనరులు ఆదా అవుతాయని, పరిపాలనపై, అభివృద్ధిపై నూటికి నూరు శాతం దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్పారు. “పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల దీర్ఘాకాలికంగా దేశానికి, రాష్ట్రాలకు మేలు చేకూర్చే గట్టి నిర్ణయాలను తీసుకోవడానికి వీలవదు. ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికలో వ్యతిరేకత వస్తుందేమో అని వెనకడగు వేయాల్సి వస్తుందని. ప్రతిసారీ ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల ఎన్నికల నియమావళి కారణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీలవదని, సంక్షేమ పథకాల అమలులో అవరోధాలు ఏర్పడతాయి. దీనివల్ల పేదలు నష్టపోతారు.ఎప్పటికప్పుడు ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధులకు పంపించడం వల్ల వారి వారి రోజువారీ విధుల్లో అవాంతరాలు ఏర్పడి అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుంది. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉండడం వల్ల పార్టీలు, నేతలు, శాసనసభ సభ్యులు, ఎంపీలు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తియుక్తులన్నింటినీ వచ్చే ఎన్నికల్లో గెలవడంపైనే దృష్టి పెడతాయి తప్పించి పరిపాలనపై కాదు. అని వెంకయ్య నాయుడు చెప్పారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు ముప్పు అన్న వాదన సరికాదు అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ” ఏకకాల ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో అమలు చేసినదే. కొంత మంది, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ కారణాలతో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను ప్రాంతీయ పార్టీలకు ముప్పు అంటూ తప్పుగా భాష్యం చెబుతూ ప్రచారం చేస్తున్నాయి. మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో 1952,1957,1962లో, ఆతర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్పప్పుడు 1967లో ఏకకాల ఎన్నికలు జరిగాయి. అంటే కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మన దేశంలో జరిగిన ఎన్నికలను స్థూలంగా గమనిస్తే గతంలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నా ప్రాంతీయ పార్టీలు లేదా విపక్ష పార్టీలు స్పష్టమైన ఆధిక్యంతో గెలిచినట్లు స్పష్టమవుతుంది. అని చెప్పారు.
“1957 లో కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానిగా ఉన్నారు. అప్పుడు జరిగిన ఏకకాల ఎన్నికల్లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. 1967లోనూ కేరళలో వామపక్ష ప్రభుత్వం గెలిచింది.అదే సంవత్సరం తమిళనాడు శానసనభ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ సమయంలో కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు. అదే సంవత్సరం ఒడిశా ప్రజలు కేంద్రంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కు ఓటు వేసినా రాష్ట్రంలో మాత్రం స్వతంత్ర పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 1984 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 400కు పైగా స్థానాల్లో గెలిచి విజయాన్ని సాధించింది. కొద్ది నెలల తర్వాత 1985 మార్చిలో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో నందమూరి తారకరామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. 1985లోనే కర్ణాటక శానసనభకు నిర్వహించిన ఎన్నికల్లో శ్రీ రామకృష్ణ హెగ్డే గారి నేతృత్వంలోని జనతాపార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. 1999 అక్టోబరులో సాధారణ ఎన్నికలతో పాటు కర్ణాటక శానసనభకు కూడా ఎన్నికలు నిర్వహించగా రాష్ట్రంలో ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో మాత్రం ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ శాసనసభకు ఇటీవల- అంటే – 2023 నవంబరు 30న నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొద్ది నెలల తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో భాజపా రాష్ర్టంలో 8 లోక్ సభ స్థానాలు గెల్చుకుంది.” అని ఏ ఏ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఫలితాలు వచ్చాయో సోదాహరణంగా వివరించారు. “లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించినా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే మేలు జరుగుతుంది, తమ నియోజకవర్గానికి ఎవరిని ఎన్నుకుంటే ఉపయోగమంటుంది అని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోగల శక్తి, యుక్తి, వివేచన ఓటర్లకు ఉంది.జమిలి ఎన్నికల వల్ల ఫలానా పార్టీకే మేలు, జాతీయ పార్టీకే మేలు అని ప్రచారం చేయడం ఓటర్ల విజ్ఞతను ప్రశ్నించడమే.” అని స్పష్టం చేశారు. ప్రభుత్వాల పనితీరు, పార్టీల నడవడికను గమనించే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు.”ఎవరు ఎక్కడ అధికారంలోకి వచ్చినా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు.. అభివృద్ధి కోసం, జాతీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావంతో కలిసి పని చేయాలి.” అని సూచించారు. పార్టీ ఫిరాయింపులు ఏమాత్రం మంచిది కాదని, పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని, ఈ విధంగా చట్టాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఉచితాలు మంచివి కావని, అవి ప్రజలకు నష్టం చేకూర్చేవని వెంకయ్య నాయుడు చెప్పారు. ఉచిత పథకాలను వాగ్దానం చేసే పార్టీలు, వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటాయో ముందుగానే వెల్లడించాలని, ఉచిత హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజలు వారిని ప్రశ్నించే పరిస్థితి రావాలని ఆయన అన్నారు. విద్య, వైద్యం మినహా వేటికీ ఉచితాలు ఇవ్వరాదన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా భారత్ ఉండేదని, విదేశీయుల దండయాత్రలు, వలస పాలన తర్వాత బలహీన పడిందని చెప్పారు. మళ్లీ ప్రజల సామర్థ్యం, తెలివితేటలు- యువతరం శక్తి సామర్థ్యాల వల్ల భారత్ పూర్వ వైభవం దిశగా సాగుతోందని, ప్రపంచంలోనే అయిదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే అవతరిస్తుందని చెప్పారు. అగ్రస్థానం సాధించే అన్ని అవకాశాలు భారత్ కు ఉన్నాయని, ఆ దిశగా మన దేశాన్ని అన్ని విషయాల్లోనూ సన్నద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్ట్యా జాతీయ ప్రయోజనాలను, సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏకకాల ఎన్నికలపై రాజకీయ పార్టీలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు.

