Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు అధికారులు చేపట్టాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: హన్మకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తుపదార్థాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, జిల్లా సంక్షేమ, వైద్య ఆరోగ్య, నార్కోటిక్స్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు, నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ మాట్లాడుతూ గంజాయి,ఇతర మత్తు పదార్థాల బారీన ఎవరు కూడా పడకుండా పోలీస్, ఇతర శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాటి బారినపడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల్లోనూ అవగాహన కార్యక్రమాలను రానున్న రోజుల్లో విరివిగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశ అనంతరం హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన నినాదాలు పట్టికను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్ రెడ్డి, సతీష్ బాబు, టిజిఏఎన్బి డి.ఎస్.పి రమేష్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డాక్టర్ అనితా రెడ్డి, డాక్టర్ ప్రహసిత్, డాక్టర్ ఆచార్య వి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలి

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత