Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తిచేస్తాం

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( revanth_anumula)స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌ ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు.తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడే ప్రత్యేక రైల్వే లైనుతో పాటు పలు ప్రాజెక్టులను వివరించారు.ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు.భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు.కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు.కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌ ‌- చెన్నై, హైదరాబాద్‌‌ – బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి గారు రైల్వే అధికారులకు సూచించారు.హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు అధికారులకు వివరించారు. దాదాపు 362 కి.మీ మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు.వికారాబాద్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని, దీంతో పాటు గద్వాల‌‌‌‌‌‌ – డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు, ఎంపీ కడియం కావ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ,ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్