(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ: వరి ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లుకు చేరేవరకు పర్యవేక్షణపై ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదుల స్వీకరణకు అధికారులకు విధులు కేటాయించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు, లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్, తదితర సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెంబరు 7330751364 ను సంప్రదించవచ్చునని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సంబంధిత అంశాలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సేవలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, పౌరసరఫరాల శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


