(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
హనుమకొండ: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అనుమతుల ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి దామెరలో ఏర్పాటు చేస్తున్న పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు మిగిలిన అనుమతుల ప్రక్రియ, నిర్వహణ, తదితర అంశాలపై డిఆర్డిఓ, సహకార, పశుసంవర్ధక శాఖల అధికారులతో పాటు మహిళా డెయిరీ నిర్వాహకులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు మిగిలిన అనుమతులు, రిజిస్ట్రేషన్, పశు సంపద, ప్రాథమిక సభ్యత్వాల నమోదు, డెయిరీ నిర్వహణ, తదితర అంశాలను ఎమ్మెల్యే, కలెక్టర్ లు అధికారులు, డెయిరీ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ కి పూర్తిస్థాయి బైలాస్ ను అధికారులు త్వరగా రూపొందించాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళా డెయిరీ కి గ్రామాల నుండి పాల సేకరణ మొదలుకొని బ్రాంచ్ మిల్క్ సెంటర్లకు, అక్కడినుండి డెయిరీకి తరలింపు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే సంఘాలలోని సభ్యులకు ములుకనూరు డెయిరీలో శిక్షణ కార్యక్రమాలను ఇప్పించినట్లు తెలిపారు. త్వరలోనే నడికూడ, పరకాల మండలాలలో బ్రాంచ్ మిల్క్ సెంటర్ లను ప్రారంభించి వాటి ద్వారా మహిళా డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో మండలంలో బీఎంసీలను ప్రారంభిస్తూ మహిళా డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో సాగుతున్నట్లు పేర్కొన్నారు. మధిర కంటే పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పరకాల మహిళా డెయిరీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు దూరదృష్టితో, నిర్దిష్టమైన ప్రణాళికలతో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర డెయిరీల ఉత్పత్తులు ఏవిధంగా విజయవంతంగా సాగుతున్నాయనే అంశాలపై అధ్యయనం కూడా చేసినట్లు పేర్కొన్నారు. సబ్సిడీపై ఎస్సీ ఎస్టీ బీసీ పాడి రైతులకు గేదెలను ఇప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రస్తుతం సభ్యత్వం ఉన్న 21 మంది ఆధార్ కార్డులు అందజేయాలని, ఫీజుబిలిటీ రిపోర్ట్ త్వరగా అందజేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగాపూర్తవుతుందన్నారు. డెయిరీ నిర్వహణను సొసైటీ లోని మహిళలే నిర్వహణ బాధ్యతలు చేపడితే బాగుంటుందని, డెయిరీ ఆపరేషన్స్ లో ప్రాసెసింగ్, క్వాలిటీ చెకింగ్, తదితర అంశాలను అనుభవం ఉన్నవారితో ప్రారంభించాలన్నారు.మహిళా డెయిరీ ఏర్పాటు నేపథ్యంలో మూడు వేల యానిమల్స్ కావాల్సి ఉండగా,ఎక్కడ లభిస్తాయనే వివరాలతో కూడిన ప్రతిపాదనలు పశుసంవర్ధక శాఖ అధికారులు రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హనుమకొండ డి ఆర్ డి ఓ మేన శ్రీను,జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఇతర అధికారులతో పాటు మహిళా డెయిరీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


