(అగ్రంపహాడు నుంచి జై భారత్ వాయిస్ ప్రతినిధి)
మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క జాతర లో సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువు దీరడం తో శుక్రవారం భక్తులతో పోటెత్తింది. దీంతో జాతర ప్రాంగణం జనం తో నిండి పోయింది. అమ్మలగన్న అమ్మ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరారు. గురువారం నాడు సమ్మక్క రాకతో మొదలైన భక్తుల సందడి శుక్రవారం మరింత ఉధృతంగా కొనసాగింది. భక్తులు పసుపు కుంకుమలు నిలువెత్తు బంగారం ( బెల్లం బుట్టల),తో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొబ్బరి కాయలు సమర్పించారు. ఇంటిల్లిపాదిని పిల్ల పాపలను చల్లంగా చూడాలని, మల్లచ్చే జాతరకు కోరిన కోరికలు తీరినట్లయితే గొర్రెపోతులను సమర్పిస్తామని మనసు నిండా మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు బెల్లం ఒడి బియ్యం సమర్పించారు. శివ సత్తులు మొ క్కులు చెల్లించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవార్లకు తలనీలాలు సమర్పించుకున్నారు. జాతరలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తూ భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ జాతర లో తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి ఈవో నాగేశ్వరరావు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి గూడప్పా డు మార్కెట్ కమిటీ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి జాతర చైర్మన్ వంచ రంగారెడ్డి, అగ్రంపహడు సర్పంచ్ గంగుల మహేందర్, మాజీ చైర్మన్ బోరింగ స్వామి జాతరను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు సీఐ ఆర్ సంతోష్ జాతరలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు సేవలందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. జాతర లో సర్కస్ జాయింట్ విల్, తదితరాలు భక్తులను అలరించాయి. జాతర లో నిరంతర విద్యుత్ అలంకారం తో అగ్రాంపహాడ్ ప్రాంగణం శోభాయమానంగా మారింది. తప్పి పోయిన పిల్లలను వారి తల్లి దండ్రులకు అప్పగించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి
మాజీ శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అగ్రంపహాడు లో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులలు గిరిజన ఆరాధ్య సమ్మక్క సారలమ్మలను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారని కోరిన కోరికలు తీర్చే దైవాలని భక్తుల విశ్వాసం అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.



