జై భారత్ వాయిస్ నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వట్టెం రిజర్వాయర్ కోసమని కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లోజీ కుటుంబం నుండి ప్రాజెక్టుకు అవసరం లేకపోయినా పందొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని వివాదాస్పద పద్ధతిలో ప్రభుత్వం, మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీలు దౌర్జన్యంగా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించిన ఫలితంగానే అనంత అల్లోజీ మరణించాడని మానవ హక్కుల వేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. డా. ఎస్ తిరుపతయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈనెల 12వ తారీకున అల్లోజీ కలుపు మందు తాగి 13వ తారీఖున నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. మరణానికి ముందు ఆసుపత్రిలో తన ఆత్మహత్యకు ప్రభుత్వమూ, కంపెనీ అధికారులే కారణమని చెప్పాడని అల్లోజీ కుటుంబాన్ని మానవ హక్కుల వేదిక ముగ్గురు సభ్యుల బృందం కలిసి విచారించమని తెలిపారు.
అనంత అల్లోజీ మరణాన్ని ప్రభుత్వం, కంపెనీ అధికారులు పురికొల్పిన ఆత్మహత్యగా కేసుగా నమోదు చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలని,అల్లోజీ కుటుంబాల భూమిలో ప్రాజెక్టుకు అవసరమైన ఐదు ఎకరాలు మినహా మిగతా భూమిని తక్షణమే విడుదల చేయాలి. ఆ అయిదు ఎకరాలకు కూడా ప్రస్తుతం గ్రామంలో నడిచే వాస్తవ మార్కెట్టు రేటు ఎకరానికి ఇరవై లక్షల రూపాయల చొప్పున కట్టించాలని కొరారు. ప్రాజెక్టుల కోసం జరిపే భూసేకరణ అనేది బీఆరెస్ పార్టీ అధికారిక కార్యక్రమం లాగా సాగుతున్నది. భూసేకరణ అనేది అనేక ఆర్థిక , సామాజిక, సాంస్కృతిక, సున్నిత మానసిక అంశాలతో కూడుకుని ఉంటుంది. ఎక్కడైనా భూ సేకరణ కార్యక్రమం అనేది ఆ గ్రామం లేదా ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలతో కూడిన, రాజకీయాల జోక్యం పెద్దగా లేని ఒక కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. ఇందులో ప్రజలు కోరుకున్న ఇద్దరు లాయర్లు, ఈ విషయంలో అనుభవం ఉన్న ఇతర ప్రాంతాల సామాజిక కార్యకర్తలూ ఉండాలి. అప్పుడే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. కుమ్మెర గ్రామ రైతులనూ, అల్లోజీ కుటుంబాన్నీ కలిసిన బృందంలో మానవ హక్కుల వేదిక బాధ్యులు డా ఎస్ తిరుపతయ్య, బొల్లి ఆధం రాజు మరియు పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు చింతపల్లి అశోక్ ఉన్నారు.