జై భారత్ వాయిస్ దామెర
ఎన్నికల్లో గెలుపు, ఓటములు, సహజమని, తనను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్ లో నియోజక వర్గ పరిధి పరకాల మున్సిపాలిటీ, గ్రేటర్ వరంగల్ పరిధి డివిజన్లు, పరకాల, నడికూడ, అత్మకూరు, దామెర, గీసుగొండ, సంగెం మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించిందన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రజావిస్తృత స్థాయి తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో గెలు పోటములు సహజమని, అధికారంలో ఉన్నా.. లేకపో యినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. పరకాల నియోజ కవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగేలా చూద్దామని, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు పాదాభివందనాలు చెబుతున్నానన్నారు. పరకాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడొద్దని, అధైర్యపడొద్దని, పార్టీ నాయకులు, కార్యకర్త లను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. పదవిలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కు ఒడిదొడుకులు కొత్తకాదని, త్వరలో రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి పకడ్బంద్ కార్యాచరణతో ముందుకుపోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఉద్యమపార్టీ అని, పోరాటాలు కొత్త కాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.