అగ్రంపహాడు జాతరలో సారలమ్మ ఆగమనం
-భక్తజన సందోహంతో కిట కిట లాడిన జాతర…
-పూనకాలతో దద్దరిల్లిన ప్రాంగణం..
-పోలీసుల భారీ బందో బస్తు
-గద్దెపైన సారలమ్మ ప్రతిష్ట…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
సమ్మక్క జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ దేవతను అశేష భక్త జన సందోహం మధ్యన పూజారి గొనెల వెంకన్న గద్దెకు చేర్చారు.
మినీ మేడారంగా పేరు పొందిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గత రెండు నెలల నుండి జాతరకు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేసి జాతర కు, రోడ్లు, స్నాన ఘట్టాలు,మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసి జాతరను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కాగా బుధవారం తొలుత గొల్లపల్లి సాంబశివరావు పూజారి ఇంటి నుండి పసుపు కుంకుమ , ఉడుతల గోవర్ధన్ పూజారి ఇంటి నుండి అంకమ్మ దేవత, గోవింద లక్ష్మి పూజారి ఇంటి నుంచి శ్రీ లక్ష్మీ దేవమ్మలను, బొమ్మగాని సత్యం బొత్తలపల్లి నుండి ఘటం కుండలను, గోనెల రవీందర్ పూజారి ఇంటి నుండి వరాల కుండలను, తెచ్చి గద్దెల వద్ద కు చేర్చారు. చివరగా గోనెల నరసింహారావు పూజారి ఇంటి నుండి పూజారి గొనేల వెంకన్న సారలమ్మ దేవతను భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా అంగరంగ వైభవంగా డప్పు చప్పుళ్ళ తో జాతర ప్రాంగణంలో సారలమ్మ గద్దెపైన ప్రతిష్టింపజేశారు. భక్తులు తండోపతండాలుగా క్యూలైన్ల ద్వారా సమ్మక్క, సార్లమ్మను అమ్మవార్లకు ఎత్తు బంగారం ,కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు జాతర పూజారులు. భక్తులు పాల్గొన్నారు.