జై భారత్ వాయిస్ హన్మకొండ
సమాజంలోని ప్రతి వ్యక్తి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఇందుకోసం ఈనెల 13వ తేదీన జరిగే లోకసభ ఎన్నికల ఓటింగ్ రోజు నగరంలోని ప్రజలందరూ ఓటు వేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం జిల్లా స్వేప్-2024 ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ పి మల్లారెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని నగరాలలో ముంబై, హైదరాబాద్ ,వరంగల్ పెద్ద నగరాలుగా గుర్తింపు పొందాయన్నారు. అయితే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అందరూ ముందుకు రావడం లేదని ఇప్పటికైనా తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని ఆమె సూచించారు. అర్బన్ పరిధిలో ఓటింగ్ శాతం 56 నుండి 58 శాతం వరకు జరుగుతుందని దీనిని మరింత పెంచాలని ఇందుకోసం ఓటింగ్ అవేర్నెస్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే లోకసభ ఎన్నికలలో ఓటింగ్లో ఎక్కువ శాతం ప్రజలు పాల్గొనాలని, సెలవును సొంత ప్రయోజనాల కోసం వినియోగించకుండా ఓటు వేయడానికి ప్రజలలో అవగాహన పెంచుటకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని ఓటు వేయుటకు అందరూ ముందుకు రావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఓటు అనేది భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ పటిష్టతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఓటింగ్ శాతం పెంచుటకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు అనేది సామాజిక బాధ్యతని, కాబట్టి ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటింగ్ లో పాల్గొని దేశానికి కావలసిన పరిపాలకులను ఎన్నుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎం ఇండస్ట్రియల్ హరి ప్రసాద్, మధురిమ, రాధా, రమేష్ మాట్లాడుతూ ఎన్నికల రోజున అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం అందరితో ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.