Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లాకు రూ.80 కోట్ల నిధులు మంజూరు.

జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 23
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం .(ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) కింద ఎన్టీఆర్ జిల్లాకు రూ.80 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు గౌరవ కలెక్టర్ శ్రీమతి సృజన గారు వెల్లడించారు.

ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో 2024 25 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.సృజన  మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన  మాట్లాడుతూ

గ్రామ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనులను గుర్తించి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు, మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు, ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం తదితర అంశాలపై చర్చలు జరిపి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. తనను గ్రామసభకు ఆహ్వానించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మాట్లాడుతూ గత ప్రభుత్వం మొక్కుబడిగా గ్రామసభలను నిర్వహించిందన్నారు. కానీ మహాకూటమి ప్రభుత్వం ప్రజలను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామసభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
జూపూడి గ్రామ సమగ్రాభివృద్ధికి దాదాపు రూ2.5 కోట్లకు పైగా నిధులు అవసరం అన్నారు. ఈ ఏడాది తొలివిడతగా రూ.55 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో సిమెంట్ రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మిగతా నిధులు రాబోయే కాలంలో విడుదల చేస్తామన్నారు. మరిన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

నిధులు మళ్లించిన గత ప్రభుత్వం.

గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన దాదాపు 13 వేల కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్ళించడం వల్ల గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించే పరిస్థితి లేదన్నారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.  కానీ  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో మహాకూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.990 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభిస్తుందన్నారు. జూపూడి గ్రామంలో పరిశ్రమలు, వివిధ కళాశాలలు ఉన్నందున పన్నువసూళ్లు కూడా సకాలంలో పూర్తి చేసి, ఆ నిధులను గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేయాలని ఆదేశించారు. ఎన్టీటీటీపీఎస్ సి.ఎస్.ఆర్ నిధులు మంజూరుకు చొరవ చూపాలి.డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో జూపూడితో పాటు పవర్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి సి.ఎస్.ఆర్ నిధులు దాదాపు రూ.20 కోట్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. వీటిని విడుదల చేసేందుకు తాను గత ప్రభుత్వంలో ఉండగానే ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. కానీ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యుత్ ఉత్పాదక సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలో విద్యుత్తు రంగాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గాడిలో పెడుతున్నారన్నారు. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఎన్టీటీపీఎస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సి.ఎస్.ఆర్ నిధులు మంజూరయ్యేందుకు గౌరవ కలెక్టర్ గారు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆయా నిధులతో మైలవరం నియోజకవర్గాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు.జిల్లా మైనింగ్ నిధులు కూడా త్వరలోనే మంజూరు అవుతాయన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. గొల్లపూడి వద్ద నిర్మించిన అమరావతికి వెళ్లే వంతెన కూడా మరో మూడు మాసాల్లో ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

కొండపల్లి బొమ్మలను ప్రోత్సహించండి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.సృజన కి ఓ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కొండపల్లి కళాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కొండపల్లి బొమ్మలను జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలలో వినియోగించాలని, తద్వారా కొండపల్లి బొమ్మల కళాకారులను మరింత ప్రోత్సహించాలని కోరారు.
కొండపల్లి మున్సిపాలిటీలో త్వరలోనే జల్ జీవన్ మిషన్ కొండపల్లి మున్సిపాలిటీకి త్వరలోనే జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి నీటికుళాయి పథకం పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  స్పష్టం చేశారు. గతంలో ఈ పనులు టెండర్ దశ వరకు చేరాయన్నారు. కానీ గత ప్రతిపాదనల్లో కొండపల్లి మున్సిపాలిటీలో గాజులపేట లే అవుట్, ఈలప్రోలు లే అవుట్ లకు పైపులైన్ వేసే అవకాశం లేదన్నారు. ఆయా లే అవుట్ లలో నివాసం ఉంటున్న వారి తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఇంటింటికి నీటికుళాయి పథకం ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు మంజూరు చేయించి, త్వరగా పనులను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఆకస్మిక తనిఖీలతో అవకతవకలకు చెక్.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులలో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సంయుక్త ఆకస్మిక తనిఖీలతో తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహాకూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావు లేదన్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు అప్పటికప్పుడు పరిష్కరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా కలెక్టర్ గారిని ఘనంగా స్వాగతించి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అక్కడ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

నేత్రపర్వంగా దివ్యమూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

Sambasivarao